info.manatemples@mail.com

+91 9866933582

పాంబండ రామలింగేశ్వర స్వామి దేవాలయం, కుల్కచర్ల


హైదరాబాద్ నుంచి సుమారు 100 కి మీ దూరం లో ఉన్న కుల్కచెర్ల మండల కేంద్రానికి 2 కి మీ దూరం లో వెలిసిన మరో పుణ్య శైవ క్షేత్రం "పాంబండ రామేశ్వరాలయం " . రామలింగేశ్వర స్వామి దేవాలయన్ని సాక్షాత్తూ శ్రీరాముడే లింగాన్ని ప్రతిష్టించి, పూజలు నిర్వహించాడు. అందుకే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడని పిలుస్తారు అని స్థల పురాణం చెబుతుంది.


త్రేతాయుగంలో రావణ సంహారం అనంతరం తిరిగి వస్తున్న నేపథ్యంలో బ్రహ్మ హత్యాపాపం నుంచి విముక్తి కోసం కోటి లింగాలను స్థాపించాలని శ్రీరాముడికి మహర్షులు సూచిస్తారు. అందులో భాగంగానే ఆయన స్వయంగా లింగాన్ని స్థాపించి పూజలు నిర్వహించాడు. అలా ఆ విధంగా ఏర్పడిన ఈ దేవాలయం ప్రస్తుతం రామలింగేశ్వరుడిగా పిలవబడుతోంది. ఈ ఆలయానికి పక్కనే రామలక్ష్మణుల దేవాలయం కూడా వుంది.


బండరాయి పాము ఆకారంలో వుండటం వల్లే దీనికి పాంబండ అనే పేరొచ్చింది. మొదట్లో ఇది పెద్ద ఏకశిలగానే వుండేది కానీ కాలక్రమంలో రెండుగా చీలిపోయింది. ఒక పెద్దపాము బండ మధ్యలో నుంచి వెళ్లడంతో అది చీలిపోయిందని అక్కడి భక్తులు చెబుతుంటారు.


ఆలయం వెనుక బాగం లో ఒక పుట్టులింగం వుంది. ఇది ప్రతీ సంవత్సరం కొద్దికొద్దిగా పెరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి పక్కనే భ్రమరాంబదేవీ ఆలయం, ముందుభాగంలో ఆంజనేయస్వామి విగ్రహం వుంటుంది. పాంబండపై ఉన్న గుండంలో నీటికి చాలా విశిష్ఠత ఉందని భక్తులు విశ్వశిస్తారు. అంతపెద్ద బండ మధ్యలో వెలసిన ఈ కోనేరులో ఎల్లప్పుడూ నీరుంటుంది. శ్రీరాముడు లింగాన్ని స్థాపించిన సమయంలో పూజ చేయడానికి పుణ్య జలాల కోసం శ్రీరాముడు బాణాన్ని సందించి బండ మధ్యలో కోనేరును సృష్టించాడనీ, ఆ నీటితోనే అభిషేకం చేశాడని భక్తులు పేర్కొంటారు. అందుకే ఈ గుండం ఎప్పుడూ ఎండిపోదు. ఈ గుండంలో స్నానం చేస్తే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని... పొలాల్లో, పశువులపై, ఇళ్లపై ఈ నీటిని చల్లితే ఎలాంటి అరిష్టాలైనా తొలగిపోతాయని ప్రజల నమ్మకం!



ఇదే మార్గం లో మనకు దర్శనమిచ్చే అతి పురాతనమైన దేవాలయాలు :-
వెంకటేశ్వర స్వామి దేవాలయం -చేవెళ్ళ
అనంత పద్మనాభ స్వామి దేవాలయం -అనంతగిరి
రామలింగేశ్వర స్వామి దేవాలయం -దామగుండం
యోగానంద నరసింహ స్వామి దేవాలయం -రాకంచెర్ల