info.manatemples@mail.com

+91 9866933582

అచలేశ్వర్ ఆలయం-మౌంట్ అబూ


రాజస్థాన్‌లోని పర్వత ప్రాంతమైన మౌంట్ అబూకు ఈశాన్య దిశలో ఎనిమిది కి.మీల దూరంలో అచలేశ్వర్ ఆలయం ఉంది. భక్తుల పూజలందుకునేందుకు ఎలాంటి శివలింగం కానీ, ప్రతిమలు కానీ లేకపోవడం ఈ ఆలయ ప్రత్యేకత. ఆలయంలోని గర్భగుడిలో ఓ చోట రంధ్రం వంటిది ఉంటుంది. దీనిని పాతాళ మార్గంగా భక్తులు కొలుస్తుంటారు. ఈ మార్గాన్ని చూస్తున్నట్టుగా గోడపై పార్వతీ, విఘ్నేశ్వరుల బొమ్మలుంటాయి.

ఆలయ ఆవరణలో తటాకం ఒకటి ఉంది. పూర్వం ఇందులో శక్తులనిచ్చే నెయ్యి ఉండేదట. ఆ నెయ్యిని తాగేందుకు రాక్షసులు తండోపతండాలుగా వచ్చేవారుట. అలా వచ్చిన రాక్షసులను రాజపుత్రరాజు ధరవర్షదేవ్ సంహరించాడని అక్కడ కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. గర్భగుడికి వెలుపల కంచుతో చేసిన నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. ఆలయానికి సమీపంలో వశిష్ట మహాముని చేసిన యజ్ఞయాగాదుల నుంచి నాలుగు రాజపుత్ర వంశాలు ఆవిర్భావించాయని ప్రతీతి.

ఈ ఆలయాన్ని కట్టేందుకు ఉపయోగించిన ఇటుకలు నీటిలో వేస్తే మునగకుండా ఉండేంత తేలికగా ఉంటాయంటే ఎవరూ నమ్మరు. అయినప్పటికీ, ఆ కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఈ ఆలయం వెలుపల తొమ్మిది అడుగుల ఎత్తున్న నంది విగ్రహం మిమ్మల్ని ఆహ్వానిస్తుంటుంది. ఈ ఆలయపు గోడలు, పైభాగాలలో ఆలయానికి సంబంధించిన పురాణ గాధలు ఉంటాయి. తప్పకుండా ఈ ఆలయ పర్యటన మీ మనసులో ముద్రగా మిగిలిపోతుంది.