info.manatemples@mail.com

+91 9866933582

శ్రీ పరశురామ స్వామి ఆలయం, జలాలాబాద్ నుంచి 30 కి.మీ దూరంలో




ఉత్తరప్రదేశ్‌లో జలాలాబాద్ నుంచి 30 కి.మీ దూరంలో పరశురాముని జన్మస్థలం ఉంది. వెయ్యి సంవత్సరాల పాటు అత్యంత పేరు ప్రఖ్యాతులతో వర్థిల్లిన ఈ స్థలాన్ని ప్రస్తుతం ఖేదా పరశురామపురి అని పిలువబడుతోంది. ఈ ప్రదేశంలోనే పరశురాముడు జన్మించినట్లు అక్కడి ప్రజల విశ్వాసం. ఈ స్థలాన్ని ముఖ్యమైన పర్యటక ప్రాంతంగా ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ఈ ఆలయానికి మరో విశేషముంది. ఆలయంలో ఉన్న ఒక శివలింగానికి ముందు పరశురాముని విగ్రహం అమరి ఉంటుంది. ఈ శివలింగాన్ని ప్రతిష్టించి, లింగానికి ముందు పరశురాముడు కూర్చున్నట్లు, ఆ తర్వాతనే ఈ ఆలయం నిర్మించినట్టు ఆలయ చరిత్ర పేర్కొంటోంది. సుమారు 20 అడుగుల ఎత్తు కలిగివుండే ఈ ఆలయం, పలు సార్లు మహమ్మదీయుల పాలకులచే కూల్చివేతకు కూడా గురైంది. అయితే భక్తులు అదే ప్రాంతంలో పరశురాముని ఆలయాన్ని పునర్నిర్మించారు.
అదేవిధంగా ప్రతీసారి ఆలయాన్ని నిర్మించేటప్పుడు వివిధ వస్తువులు బయటపడేవి. ఈ తరహాలో ఓ సారి ఎనిమిది అడుగుల గోవు విగ్రహాన్ని వెలికి తీశారు. ఇలా బయల్పడిన విగ్రహాన్ని ఆలయ ప్రవేశద్వారానికి ఎడమవైపున ప్రతిష్టించారు. ఆలయానికి పశ్చిమంలో కొలనుతో కూడిన ద్రాక్షాయణి కోవెల వెలసి ఉంది. ద్రాక్షాయణి ఆలయానికి చేరుకుని ప్రార్థించే భక్తులకు సకల సౌభాగ్యాలతో పాటు, కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీక.
అంతేకాకుండా కొత్తగా వివాహమైన వధూవరులు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు కూడా చేస్తారు. దూరపు ప్రాంతాల నుంచి పరశురాముని ఆలయాన్ని దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. తమ కోర్కెలు తీరిన భక్తులు మొక్కులు తీర్చుకుంటుంటారు. మహంత్ సత్యదేవ్ పాండ్య పర్యవేక్షణలో ఉన్న ఈ ఆలయంలో మరమ్మతు కార్యక్రమాలు, భవనాన్ని ఆధునికీకరించడం వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగంణంలో 24 రకాలైన నవగ్రహ విగ్రహాలను ప్రతిష్టించారు