info.manatemples@mail.com

+91 9866933582

ఉపమాక వేంకటేశ్వరాలయం|Upamaka Venkateshwara SWamy Temple




ఉపమాక అంటే సాటి లేనిది అని అర్థం.ఇటువంటి క్షేత్రం మరెక్కడా ఉండదని అర్థం స్ఫురించేలా పురాణాలలో ఉపమాక అనే పదాన్ని ఉపయోగించారు. ‘కలౌ వేంకటనాయక’ అన్నట్లుగా, కలియుగంలో శ్రీమన్నారాయణుడు వేంకటేశ్వరస్వామి అవతారంలో వేంచేస్తారని పురాణాలు చెబుతున్నాయి.
ఇందుకు నిదర్శనమే ఉపమాక వేంకటేశ్వరస్వామి. ఒకసారి ఆ ప్రాంతాన్ని దర్శించినవారు తిరిగి భగవంతుడిని దర్శించుకోవడానికి పదే పదే వెళ్లి తీరతారని స్థానికులు చెబుతారు. స్వామివారు గరుడాద్రిపై విశ్రాంతి కోసం పవళించినట్లుగా తెలుస్తోంది. ఆలయానికి సమీపంలో బందుర సరస్సు ఉంది. ఇది చాలా పవిత్రమైనదని, తిరుమలలోని పాపనాశంతో సమానమని చెబుతారు.


స్థల పురాణం :
క్రీ.శ. ఆరవ శతాబ్దంలో తూర్పుగోదావరి జిల్లా కాండ్రేగుల సంస్థానాన్ని పరిపాలించిన శ్రీకృష్ణ భూపాలుడు స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లు క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. ఇక్కడ క్షేత్రపాలకుడైన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని నారదుడు ప్రతిష్ఠించాడని, 11వ శతాబ్దంలో రామానుజులవారు ఈ ఆలయాన్ని దర్శించారనీ తెలుస్తోంది. స్థలపురాణం ద్వాపర యుగంలో గరుత్మంతుడు శ్రీకృష్ణ భగవానుడిని ఎల్లవేళలా తన వీపుపై ఉండాలని కోరాడు. దక్షిణ సముద్రతీరంలో గరుడ పర్వతం ఉందని, తాను వేటకు వచ్చి అక్కడ వేంకటేశ్వరునిగా స్థిరపడతానని వరమిచ్చాడు. అలాగే మునులు తమకు మోక్షం ప్రసాదించాలని కోరగా, దక్షిణ సముద్ర తీరమంతా అరణ్యప్రాంతమని, అక్కడ అడవి జంతువులుగా జన్మిస్తే, తాను వేటకు వచ్చి మోక్షం ప్రసాదిస్తానని, అనంతరం అక్కడే స్థిరపడతానని వరమిచ్చినట్లు బ్రహ్మ వైవర్త పురాణం చెబుతోంది.
మాట నిలబెట్టుకోవడం కోసం శ్రీకృష్ణుడు... ఉపమాక గ్రామంలో ఉన్న గరుడ పర్వతం మీద కొలువయ్యాడని, అక్కడ సంచరించే గొర్రెల కాపరులు స్వామివారికి నిత్య సేవలు చేస్తూ, నైవేద్యాలు సమర్పించడం ద్వారా భగవంతుడు వెలిశాడని గ్రామప్రజలు తెలుసుకున్నారని తెలుస్తోంది. ఆ విధంగా శ్రీమన్నారాయణుడు గరుత్మంతునికి, ఋషీశ్వరులకు ఇచ్చిన వరప్రభావంతో కలియుగంలో షడ్భుజాలతో, లక్ష్మీ సమేతుడై, అశ్వాన్ని అధిరోహించి దర్శనమిస్తాడు.
ఆరు భుజాలతో దర్శనమిచ్చే అరుదైన విగ్రహం: ఇక్కడి వేంకటేశ్వరుడు ఆరు భుజాలు, పంచాయుధాలతో దర్శనమిస్తాడు. ఇందులో ఐదు భుజాలు దుష్ట శిక్షణకు, ఒక హస్తం అభయ ముద్రలో ఉంటూ, భక్తులకు అభయమిస్తుంటాడు. గుర్రం మీద కూర్చుని, క్రింద వామభాగంలో ఎడమవైపున లక్ష్మీదేవిని కలిగి కనువిందు చేస్తాడు. స్వయంభూగా వేంచేసిన క్షేత్రం ఉపమాక. ఈ పేరు పురాణాలలోనూ కనిపిస్తుంది.


వెళ్ళు మార్గం : తుని – విశాఖపట్టణం ప్రాంతాలకు మధ్యగా ఎన్‌హెచ్‌ – 5 నుంచి ఒక కిలోమీటరు దూరంలో ఉంది ఉపమాక గ్రామం.