info.manatemples@mail.com

+91 9866933582

రథసప్తమి రోజున సూర్యదేవుని ఏలా పూజించలి ?



రథసప్తమి సూర్యదేవుని పండుగ. ఆరోజున ఈ లోకానికి వెలుగును ఇచ్చే భగవంతుడైన సూర్యునికి పుట్టినరోజు. మాఘమాసంలో వచ్చే సప్తమితిథిని రథసప్తమిగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యదేవుడు ఈ లోకానికి వెలుగును ప్రసాదించినట్లు పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజును సూర్య జయంతిగానూ పిలుస్తారు. అందుకే రథ సప్తమి రోజున సూర్యుడిని పూజించి, స్తుతించి, ఉపవసించేవారికి ఆయురారోగ్యాలు చేకూరుతాయి.
రథసప్తమి పూజతో పూర్వజన్మల పాపాలు హరించుకుపోతాయి. రథసప్తమి రోజున అరుణోదయంలో స్నానమాచరించాలి. అరుణోదయ కాలంలో పుణ్య తీర్థాల్లో స్నానమాచరించాలి. ఈ అరుణోదయ కాలం అంటే సూర్యోదయానికి ముందు 24 నిమిషాలని అర్థం. సూర్యోదయానికి ముందే స్నానం చేయడమే దీని అర్థం. ఇలా చేయడం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులు హరించుకుపోతాయి. రథ సప్తమి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఈ రోజున పుణ్య నదుల్లో స్నానమాచరిస్తారు. స్నానానికి అనంతరం అర్ఘ్యదానాలు చేస్తారు. అటు పిమ్మట స్వచ్ఛమైన నెయ్యితో దీపమెలిగించి.. ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తారు. పూజకు ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగించడం ద్వారా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సంప్రాప్తిస్తాయి.

సూర్యదేవుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. సూర్యదేవుడు బంగారు రథంపై ఆసీనుడై.. ఏడు తెల్లటి గుర్రాలతో స్వారీ చేస్తూ వుంటాడు.
రథ సప్తమి రోజున
''జననీ త్వం హి లోకానం సప్తమీ సప్తసప్తికే, సప్తవ్యాహృతికే దేవి! నమస్తే సూర్యమాతృకే'' అనే మంత్రం చదువుతూ ఏడు జిల్లేడు ఆకులు లేదా చిక్కుడు ఆకులు తల, భుజాలపై ఉంచుకుని స్నానం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఏడేడు జన్మల్లో చేసిన ఏడు పాపాలు తొలగిపోతాయి. ఆ రోజున నెయ్యితో దీపారాధన చేయడం శ్రేయస్కరం.
తులసీ కోట ఎదురుగా ఏడు చిక్కుడు కాయలతో రథం చేసి చిక్కుడు ఆకులపై పరమాన్నం వుంచి దేవుడికి నైవేద్యం పెడితే అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. రథసప్తమి రోజున దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయడం, చిమ్మిలి దానం చేస్తే సకలశుభాలు చేకూరుతాయని విశ్వాసం. రథసప్తమి స్నానం, జప, అర్ఘ్యప్రదానం, తర్పణ, దానాదులన్నీ అనేక కోట్ల రెట్లు పుణ్యఫలాలను, ఆయురారోగ్యాలను, సంపదలను ఇస్తాయని పండితుల వాక్కు. నైవేద్యానికి బూరెలు, చిక్కుడు కాయలతో పొంగలి తయారు చేసుకోవాలి. ఉదయం ఆరు గంటల నుంచి 12 గంటల లోపు పూజ చేయాలి. ఆవునేతితో రెండు దీపారాధన చేయాలి. పూజకు ముందు "ఓం హ్రీం సూర్యాయ నమః" అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి.

ఆపై పొంగలిని లేదా పరమాన్నాన్ని నైవేద్యం నివేదన చేసి, ప్రత్యక్షంగా కనిపించే సూర్యునికి దీప, దూప, నైవేద్య ,కర్పూర హారతి ఇచ్చాక, రాగి చెంబులో శుభ్రమైన నీటితో నింపి అందులో చిటికెడు పసుపు, కుంకుమ, పంచదార, పచ్చి ఆవుపాలు కొన్ని.. ఎర్రని పువ్వు చెంబులో వేసి రెండు చేతులతో చెంబును చేత పట్టుకుని రెండు చేతులను ఆకాశానికి చాచి సూర్యున్ని చూస్తూ మనస్పూర్తిగా స్వామి వారికి నమస్కారం చేస్తూ ''ఓం శ్రీ సూర్య నారాయణాయ నమ:'' అని స్మరిస్తూ.. చేస్తూ రాగి చెంబులో ఉన్ననీళ్ళను భూమిపైకి వదలాలి.
ఇలా అర్ఘ్యమిచ్చాక.. సాష్టాంగ నమస్కరం చేసి మొదట ప్రసాదాన్ని తను స్వీకరించి, శుభ్రంగా చేతులు కడుక్కుని ఇతరులకు పంచాలి. ఆ తర్వాత కిలో గోధుమలు, బెల్లం, అరటి పండ్లను అరటి ఆకులోకాని, ఆకులతో చేసిన విస్తరిలో పెట్టి ఆవునకు తినిపించాలి. గోమాతకు మూడు ప్రదక్షిణలు చేయాలి. ఇలాచేస్తే ఈతిబాధలు తొలగిపోతాయి. అనారోగ్యాలు తొలగి.. ఆయురారోగ్యాలు చేకూరుతాయి.

.