తిరుమల ఏడుకొండలు. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే ప్రతి ఒక్కరు ఏడుకొండలు ఎక్కాలి.. ఏడుకొండలకు వెళ్లాలి అంటుంటారు. అయితే చాలా మందికి ఏడుకొండలంటే తెలియదు. అసలు ఏడుకొండలంటే ఏమిటో తెలుసుకుందాం రండి...
ఏడుకొండల్లో 1.వృషాద్రి, 2.వృషభాద్రి, 3.గరుడాద్రి 4.అంజనాద్రి 5.శేషాద్రి 6.వేంకటాద్రి, 7.నారాయణాద్రి.. ఇలా మొత్తం ఏడు పేర్లున్నాయి.
ఏడు చక్రాలు దాటితే ఆనందభూతి కలుగుతుంది. ఆనంద నిలయం ఎక్కడ ఉంటుంది. బ్రహ్మస్థానంలో ఉంటుంది. అందుకే శ్రీవారు ఏడుకొండలపై ఉంటాడు. ఈ ఏడుకొండలు ఎక్కడం కూడా ఒక రహస్యం ఉంది. ఏడు కొండలు సాల గ్రామాలే. ఆ ఏడు కొండలు మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, వృక్షాలు ఏవైనా మహర్షుల అంశాలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు. ఏడుకొండలెక్కినా సర్వపాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.
1.వృషభాద్రి - అంటే ఎద్దు.. వృషభానికి బుగ్వేదంలో ఒక సంకేతం ఉంది. ఎద్దు మీద పరమ శివుడు కూర్చుంటాడు. దానికి నాలుగు కొమ్ములుంటాయి. మూడు పాదాలు (భూత భవిష్యత్, వర్తమాన కాలాలు) వాక్కు అంటే శబ్ధం, శబ్ధం అంటే వేదం. వేదం అంటే ప్రమాణం. వేదమే ప్రయాణం. వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరించిన వాడు మొదటి కొండ ఎక్కుతాడని పురాణాలు చెబుతున్నాయి.
2.వృషాద్రి - అంటే ధర్మం.. ధర్మం అంటే నువ్వు వేదాన్ని అనుసరించి చేయాల్సిన పనులు. నీకు భగవంతుడు ఇచ్చిన వాటితో మంచివి వినడం, చూడటం. మంచి వాక్కు మొదలైనవి. దాని వల్ల ఇహంలోను, పరలోకంలోను సుఖాన్ని పొందుతాడు. అవి చెయ్యడమే వృషాద్రిని ఎక్కడం.
3.గరుడాద్రి - అంటే పక్షి.. ఉపనిషత్తుల జ్ఞానాన్ని పొందడం. షడ్ అంటే జీర్ణం కానిది. ఒక్క పరమాత్మ ఒక్కడే ఉంటాడు. మిగిలిన వాటికి 6 వికారాలు ఉంటాయి. పుట్టినది, ఉన్నది, పెరిగినది, మార్పు చెందినది, తరిగినది, నశించినది. ఇవ్వన్నీ పుట్టిన వాడికి జరుగుతూనే ఉంటాయి. ఆ ఆరులేని వాడు భగవంతుడు. భ-ఐశ్వర్య బలం, వీర్య తేజస్సు, అంతా తానే బ్రహ్మాండమైనవాడు. అన్ - ఉన్నవాడు, కళ్యాణ గుణ సహితుడు, హేయగుణ రహితుడు అటువంటి భగవానుణ్ణి జ్నానం చేత తెలుసుకోవడమే గరుడాద్రి.
4. అంజనాద్రి - అంజనం అంటే కంటికి కాటుక. ఈ కంటితో చూసిన దాంట్లో అంతటా బ్రహ్మమే ఉందని తెలుసుకోవడం కంటికి కాటుక. ఇదంతా పరమాత్మ సృష్టియే. అప్పడు అంజనాద్రిని దాటుతాడు.
5. శేషాద్రి - ప్రపంచం అంతా బ్రహ్మమే అని చూసాడనుకోండి. వాడికి రాగద్వేషాలు ఉండవు. వాడికి క్రోధం ఉండదు. వాడికి శత్రుత్వం ఉండదు. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పాడు. తాను కాకుండా ఇంకోటి ఉంది అన్న వాడికి భయం. అంతా బ్రహ్మమే అనుకునేవాడికి భయం ఉండదు. ఎప్పుడూ ఒకేలా ఉండటంమే బ్రహ్మం. ఆ స్థితికి ఎక్కితే శేషాద్రిని ఎక్కడం.
6.వేంకటాద్రి - వేం.పాపం.. కట.తీసేయడం. కాబట్టి పాపాలు పోతాయి. అంతా బ్రహ్మమే చేయిస్తున్నాడు. అందుకనే మనకి బ్రహ్మం తెలిసిన వారు పిచ్చివాళ్ళలా కనపడుతారు. రామ క్రిష్ణ పరమహంస ఈ పిచ్చి నాకు ఎప్పుడు వస్తుందో అంటూ ఉండేవారు. అందుకు జ్ఞాని, పిచ్చివాడు ఒకలా ఉంటారు. ఆయనకే అర్పణం అనడం. అటువంటి స్థితిని పొందడం వెంకటాద్రి ఎక్కడం.
నారాయణాద్రి - అంటే తుల్యావస్థని కూడా దాటిపోయి, తానే బ్రహ్మముగా నిలబడిపోతాడు. అటువంటి స్థితిని పొందడం నారాయణాద్రి. వేంకటాచలంలో ఏడుకొండలు ఎక్కడం వెనకల ఇంతటి నిక్షేపాలను ఉంచారు.
ఇలా ఏడుకొండలు ఎక్కడం వల్ల ఎంతో పుణ్యమని మన తాతముత్తాతలు చెబుతుంటారు. ఇప్పటికీ వేలమంది భక్తులు కాలినడకన తిరుమలకు వెళుతుంటారు. తితిదే కూడా రెండు మార్గాలను భక్తుల కోసం అందుబాటులో ఉంచింది. ఒకటి అలిపిరి పాదాల మండపం, మరొకటి శ్రీవారి పాదాలమండపం. కాలినడక దర్శనానికి వెళ్ళే భక్తులకు ప్రత్యేకంగా దర్శన భాగ్యాన్ని కూడా తితిదే కల్పిస్తోంది. కాలినడక మార్గం కారణంగా గంటల తరబడి వేచి ఉండకుండా అతి సులువుగా భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు.