info.manatemples@mail.com

+91 9866933582

చెన్న కేశవ స్వామి దేవాలయం - మార్కాపురం




ప్రకాశం జిల్లాలోని మార్కాపురం లోని శ్రీ లక్ష్మి చెన్న కేశవ దేవాలయం ఎంతో పురాతనమైన దేవాలయం . 11 వ శతాబ్దం లో బ్రహ్మ నాయుడు ఆలయ మండపాలు నిర్మించారట . 1513లో శ్రీకృష్ణదేవరాయలు స్వామివారిని దర్శించుకుని కల్యాణ, బ్రహ్మోత్సవాలను జరిపించారు. ఆలయ నిర్మాణానికి తన సామంతరాజు తిమ్మరాజయ్యను ఆదేశించి... స్వామివారికి గర్భాలయం, అంతరాలయం, మహాద్వారం, గర్భగుడిపై ఉన్న విమానగోపురం, రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయ నిర్మాణాలను పూర్తిచేయించారు.


ఈ ఆలయం లో శ్రీ చెన్న కేశవ స్వామి మూలవీరాట్టు శంకు, చక్ర ,కౌముదిలతో పాటు ,అది శేషుని ఆయుధంగా ధరించి ఉండటం ప్రత్యేకత . మూల వీరాట్టుకు ఇరు వైపులా శ్రీదేవి ,భూదేవి విగ్రహాలు , కుడివైపు మార్కండేయ మహర్షి ,ఎడమ వైపు మరికా మారకులు అనే దంపతులు విగ్రహాలు ఉన్నాయి . పూర్వం మారిక పేరుతో వెలసిన మారికపురం కాలక్రమం లో మార్కాపురం గ మారింది అని చెబుతారు . ధనుర్మాసంలో సూర్యోదయ సమయాన ఉదయ భానుని లేలేత కిరణాలు గర్భాలయంలోని మూలవిరాట్టు పాదాల నుంచి శిరస్సు వరకూ వ్యాపిస్తాయి.
శ్రీమహావిష్ణువు అలంకారప్రియుడు. అందుకే ఆయన్ని చెన్నకేశవుడు అని కూడా పిలుస్తారు. అంటే అందమైన కేశవుడు అని అర్థం. అలాంటి చెన్నకేశవుడు మొట్టమొదట భూమిపై వెలసిన క్షేత్రం ప్రకాశం జిల్లాలోని మార్కాపురం. నాలుగు యుగాల్లోనూ ఉన్నదని చెప్పే విశేషాలు. మార్కండేయుడు... శివారాధన చేసి మృత్యువును జయించిన చిరంజీవి. ఆయన 'గజారణ్య సంహిత' అనే గ్రంథాన్ని రచించారు. ఈ 'గజారణ్యం' మరేంటో కాదు... ప్రకాశం జిల్లాలోని మార్కాపురమే.



కృతయుగం కంటే ముందు సంగతి. అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన అరణ్యం. మహర్షులు తపస్సు చేసుకునేవారు. వాళ్ల తపస్సును భంగం చేసేందుకు రాక్షసులు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. అప్పుడు మహర్షుల కోరికమేరకు శ్రీహరి ఇక్కడ చెన్నకేశవుడిగా స్వయంభువుగా వెలిశాడు. అమ్మవారు రాజ్యలక్ష్మీదేవిగా అవతరించింది. కృతయుగంలో ఈ ప్రాంతంలో ఉండే ఏనుగులు స్వామిని గుండికా నది (గుండ్లకమ్మ) నీటితో అభిషేకించేవట. అందుకే దీనికి 'గజారణ్యం' అనే పేరు వచ్చింది.
త్రేతాయుగంలో గౌతమ మహర్షి స్వామికోసం ఇక్కడే తపస్సు చేశాడు. ద్వాపరయుగంలో రాక్షసుల బాధలకు తట్టుకోలేని దేవతలు చెన్నకేశవుణ్ణి పూజించారట. అందుకే దీనికి 'స్వర్గసోపానం' అని పేరు వచ్చిందని చెబుతారు.
కలియుగంలో మారికా, మారకులనే భక్తులు స్వామికోసం తపమాచరించారట. వాళ్ల తపస్సుకు మెచ్చి స్వామి ప్రత్యక్షమయ్యారట. అప్పట్నుంచీ ఈ క్షేత్రాన్ని వాళ్ల పేరిట మారికాపురమనీ, మారకాపురమనీ పిలిచేవారు. అదే కాలక్రమంలో మార్కాపురం అయ్యిందంటారు.



ఈ ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి, వేణుగోపాలస్వామి, రంగనాయకస్వామి, గోదాదేవి, రామానుజుల వంటి మరికొన్ని ఆలయాలు ఉన్నాయి .
ప్రత్యేక కార్యక్రమాలు :-
చెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు వేదకాలం నుంచీ జరుగుతున్నాయని గజారణ్య సంహితలో ఉంది. ఆ సమయంలో 12 రోజులపాటు (ప్రతిరోజూ చంద్రోదయానంతరం) వాహనోత్సవాలు జరుగుతాయి. ఏటా చైత్రశుద్ధ చతుర్దశి రోజున బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, పౌర్ణమి నాడు ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సూర్య, చంద్ర, సింహ, శేష, యాళి, పొన్న, హనుమ, గరుడ, గజ, అశ్వ, హంస వాహనోత్సవాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైంది రథోత్సవం. దీనికి సుమారు లక్షమంది భక్తులు హాజరవుతారని అంచనా.
వెళ్ళు మార్గం :
ఇలా వెళ్లొచ్చు -- ఒంగోలు నుంచి మార్కాపురానికి 94 కి.మీ. దూరం. బస్సుల్లో రావొచ్చు. రైలుద్వారా విజయవాడ-కర్నూలు మార్గంలో ఉన్న మార్కాపురం చేరుకోవచ్చు.