హిందూ సంప్రదాయంలో లక్ష్మీదేవి సిరి సంపదల దేవత. వివిధ భాగ్యాల అధిష్టాన దేవతలుగా ఈ లక్ష్మీ దేవియే అష్టలక్ష్ములుగా పూజింపబడుతుంది. దేవాలయాలలో అష్టలక్ష్ములు ఒకే చొట అర్చింపబడడం సంప్రదాయం.
1. ఆదిలక్ష్మి : "మహాలక్ష్మి" అనికూడా అంటారు. నాలుగు హస్తాలతో, ఒక చేత పద్మం, మరొక చేత పతాకం ధరించి, రెండు చేతులందు అభయ వరద ముద్రలు కలిగి ఉంటుంది.
2. ధాన్యలక్ష్మి : ఎనిమిది చేతులతో, పచ్చని వస్త్రాలతో ఉంటుంది. రెండు చేతులలో పద్మాలు, ఒక చేత గద, మూడు చేతులలో వరి కంకి, చెరకు గడ, అరటి గెల కలిగి రెండు చేతులు వరదాభయ ముద్రలతో ఉంటుంది.
3. ధైర్యలక్ష్మి : "వీరలక్ష్మి" అని కూడా అంటారు. ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. చక్రము, శంఖము, ధనుర్బాణములు, త్రిశూలము, పుస్తకము (?) ధరించినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో నుండును.
4. గజలక్ష్మి : రాజ్య ప్రదాత. నాలుగు హస్తములు కలిగిన మూర్తి. ఇరువైపులా రెండు గజాలు అభిషేకం ఛేస్తుంటాయి. ఎర్రని వస్త్రములు ధరించినది. రెండు చేతులలో రెండు పద్మములు కలిగినది. రెండు చేతులు వరదాభయ ముద్రలలో ఉంటాయి.
5. సంతానలక్ష్మి : ఆరు చేతులు కలిగినది. రెండు కలశములు, ఖడ్గము, డాలు ధరించినది. వడిలో బిడ్డ కలిగియున్నది. ఒకచేత అభయముద్ర కలిగినది. మరొక చేయి బిడ్డను పట్టుకొనియున్నది. బిడ్డ చేతిలో పద్మము ఉన్నది.
6. విజయలక్ష్మి : ఎనిమిది చేతులు కలిగినది. ఎర్రని వస్త్రములు ధరించినది. శంఖము, చక్రము, ఖడ్గము, డాలు, పాశము ధరించినది. రెండు చేతుల వరదాభయ ముద్రలు కలిగినది.
7. విద్యాలక్ష్మి : శారదా దేవి.చదువులతల్లి.చేతి యందు వీణ వుంటుంది.
8. ధనలక్ష్మి : ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించినది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతినుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.
కొన్ని చోట్ల ఐశ్వర్యలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, వరలక్ష్మి అనే పేర్లు ఉంటాయి.
అష్టలక్ష్మీ దేవాలయం భారత దేశము లోని తెలంగాణ రాష్ట్రంలోని అష్టలక్ష్మీ ప్రధాన దైవంగా గల హిందూ దేవాలయం. ఈ దేవాలయం దక్షిణ భారతీయ నిర్మాణ శైలిలో నిర్మించబడినది.
హిందూ పురాణాల ప్రకారం, ఈ దేవత ధన సంపదకు ప్రతీకగా నిలుస్తుంది. లక్ష్మీ దేవత సంపదనిచ్చే దేవతగా హిందువుల హృదయాల్లో స్థిరపడింది. కానీ కొన్ని దేవాలయాలు మాత్రమే లక్ష్మీ యొక్క ఎనిమిది రూపాలతో కూడుకొని అష్టలక్ష్మీ ఆలయాలుగా ప్రసిద్ధి చెందినవి.
భాగ్యనగరం లో దిల్సుఖ నగర సమీపాన గల కొత్త పెట్ వాసవి కాలని లో నిర్మించబడిన అష్టలక్ష్మి దేవాలయం ఎంతో రమణీయంగా ఉంటుంది . ధనం ,ధాన్యం ,విద్య ,వైద్యం, విజయం ,ఐశ్వర్యం ,సంతానం , సౌభాగ్యం అనే అష్ట కష్టాలను తీరుస్తూ వున్నా అష్టలక్ష్ములు కొలువు తీరిన దేవాలయం ఇది.
దేవాలయం నిర్మించడానికి కాలని వాసులు చాలా కష్టపడ్డారు . అధ్బుతమైన దేవాలయం ప్రసాంతమైన వాతావరణం లో ,మహిమాన్వితమైన దేవత మూర్తులతో,నాయనందకరంగా దర్శనం ఇస్తుంది .
ఆలయానికి చుట్టూ మూడు వైపులా ఏడు గర్భాలయాలు ఉన్నాయి . ఈ దేవాలయంలో గల విగ్రహాలలో ఆదిలక్ష్మీ, ఐశ్వర్యలక్ష్మీ, సంతానలక్ష్మీ,ధనలక్ష్మీ,ధాన్యలక్ష్మీ,గజలక్ష్మీ,విజయలక్ష్మీ మరియు వరలక్ష్మీ ప్రధానమైనవి. ఈ దేవతలు అలంకరణలను బంగారు మరియు కాసులపేర్ల హారాలు కలవు. ఈ దేవాలయాన్ని దర్శించినవారిలో కొందరు విగ్రహాల శిల్పకళ మరియు అలంకరణలను గూర్చి ప్రస్తుతిస్తే మరికొంత మంది ఆ ఆలయ గోపురంలో గల వివిధ విగ్రహాలను గూర్చి ప్రస్తుతిస్తారు.రాత్రి వేళలలో ఈ దేవాలయం విద్యుద్దీపాల వెలుగులతో శోభాయమానంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని కొంత దూరం నుండి వీక్షించేటప్పుడు పాలరాతి నిర్మాణంలా కనిపిస్తుంది
వైశాకమాసం లో ఇక్కడ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి .