info.manatemples@mail.com

+91 9866933582

బ్రహ్మేందాద్రి దేవతలు పూజించే శ్రీవారి పాదాలు



కోనేటి రాయుడు తిరుమల వెంకన్నను భక్తులే కాదు బ్రహ్మాది దేవతలు కూడా పూజిస్తారని పురాణాలు చెబుతున్నాయి. వేంకటాచల క్షేత్రానికి బ్రహ్మాది దేవతలు వచ్చినపుడు నేరుగా శ్రీవారి పాదాల వద్దకు చేరుకుని శిరస్సు వంచి పాదపద్మాలకు నమస్కరిస్తారట. కాలి అందెల వరకు సమర్పింపబడిన సుగంధభరితమైన సుమనోహరమైన వివిధ రంగుల రంగుల పుష్పాలకు మరింత పరిమళాన్ని శోభనూ చేకూర్చి చూపరులు ఆనందాన్ని కలిగించే శ్రీ వేంకటేశ్వరస్వామి పాదద్వయ సౌందర్యాన్ని రెప్పలు వాల్చకుండా బ్రహ్మాది దేవతలే తిలకిస్తారట..

రెండు పాదాలు సరిసమానంగా ప్రకాశిస్తూ ఎప్పుడు దర్శించినా, ఎన్నిసార్లు దర్శించినా, ఎంతసేపు దర్శించినా తనివితీరకపోగా, ఇంకా ఎప్పుటికప్పుడు నిత్యనూతనంగా తొలిసారిగా దర్శించినట్లుగానే దివ్యానుభూతిని భక్తులు పొందుతారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి తన సున్నితమైన చిగురుల వంటి చేతులతో మెత్తగా సుతి మెత్తగగా అత్యంత భయభక్తులతో, ప్రేమతో ఒత్తినా ఎర్రగా కందిపోయే ఏడుకొండలవాని పాదాల సుకుమారాన్ని ఎవరికీ వారు కన్నులపండువగా దర్శించి అనుభవించడం తప్ప వర్ణించడం సాధ్యం కాదని పురాణాలే చెబుతున్నాయి అంతేకాదు భక్తుల పాలిట కొంగుబంగారమైన కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఎందరెందరో నిత్యమూ, నిరంతరాయంగా దర్శిస్తూ ఉన్న శ్రీనివాస ప్రభువుల దివ్యమైన పాదపద్మముల గురించి ఋగ్వేదం శ్రీ మహా వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైన తేనెల ఊటలే అని కీర్తించారట.

తనపాదాల గురించి వేంకటేశ్వరస్వామే ఇలా అన్నారట. అందరికీ దర్శనీయమైన, అనుభవయోగ్యమైన, శాశ్వతమైన సత్యమైన తేనెల వూటలే నా పాదాలు. దర్శించండి..ధన్యులుకండి...అంటూ ఆయనే తన కుడిచేత్తో పవిత్ర పాదాలను చూపించారట.

అలాంటి దివ్యాతిదివ్యమైన శ్రీ స్వామివారి బంగారు పాదపద్మాలు ఎల్లవేళలా పుష్పాలతో తులసితో నిండి ఉంటాయి. ఉదయం పూట సుప్రభాత దర్సనంలో మాత్రమే ఎలాంటి పూలూ తులసి లేకుండా శ్రీనివాసుని బంగారు పాదాలను దర్శించవచ్చు. శ్రీ స్వామివారి మూల విరాణ్మూర్తి యొక్క నిజపాదాలు ఎల్లవేళలా బంగారుతో చేయబడిన పాదకవచాలు తొడగబడి ఉంటాయి. ఒక శుక్రవారం నాడు అభిషేక సమయంలో గానీ, లేక వెనువెంటనే జరిగే అభిషేకానంతర దర్శనంలో గాని మాత్రమే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి నిజమైన పాదాలను దర్సించుకోవచ్చు. అప్పుడు తప్ప మిగిలిన అన్ని వేళలా శ్రీ స్వామివారి పాదాలు బంగారు పాదకవచాలతో విరాజిల్లుతూ ఉంటాయి.

అయితే ప్రతిరోజు సుప్రభాతానంతరం, తోమాలసేవ కంటే ముందుగా, శ్రీ స్వామివారు ఈ బంగారు పాదకవచాలను పక్కకు తీసి స్నానపీఠంపై ఉంచి ఆకాశగంగా తీర్థజలాలతో అభిషేకిస్తారు. వీటితో పాటు శ్రీ స్వామివారి కౌతుకమూర్తి అయిన భోగ శ్రీనివాసునికి కూడా నిత్యాభిషేకం జరుగుతుంది. ఇలా ప్రతిరోజు ఏకాంతంగా జరుగుతుంది. ఏకాంతంగా జరిగే ఈ అభిషేకాన్ని ఇతరులు ఎవరు దర్శించడానికి వీలు లేదు. కానీ ప్రతి శుక్రవారం నాడు మాత్రం శ్రీవారి మూలమూర్తికి పచ్చకర్పూరం, పునుగు, జవ్వాది, చందనం మున్నగు సుగంధ, పరిమళ ద్రవ్యాలతో కూడి ఆకాశగంగా జలాలతో అభిషేకం జరుపబడుతుంది. జలాలతో అభిషేకం జరుపబడుతుంది. ఈ అభిషేకాన్ని తగిన రుసుమును చెల్లించి భక్తులు దర్శించి తరించవచ్చును. నిత్యాభిషేకంలో పాల్గొనే భోగ శ్రీనివాసమూర్తిని గురించి మూలమూర్తికి జరిగే శుక్రవారాభిషేకం విశేషాలను గురించి ఎంత చెప్పినా తక్కువే.

ఇలా ప్రతిరోజు శ్రీవారి మూల విరాణ్మూర్తి బంగారు పాదాలకు భోగ శ్రీనివాసమూర్తికి, అలాగే ప్రతి శుక్రవారం నాడు శ్రీవారి మూలమూర్తికి ప్రధానంగా జరిగే అభిషేకానికి గాను ప్రతిరోజు ఉదయం పూట ఆకాశగంగా తీర్థజలాలు తెస్తారు. ఈ తీర్థజలాలను వెండి బిందెలతో ఏనుగుపై ఎక్కి ఛత్ర చామల మంగళ వాద్యాలతో ఆకాశగంగ తీర్థం నుండి శ్రీవారి ఆలయానికి నేటికీ శ్రీ వైష్ణవ భక్తుల చేత సంప్రదాయబద్ధంగా తేజడుతున్నది. ఈ ఆకాశగంగ తీర్థం తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పూర్వం (క్రీస్తు శకం 11వ శతాబ్థం) తిరుమల నంబి అనే శ్రీ వైష్ణవ భక్త శిఖామణి తిరుమలలో మొట్టమొదట ఈ తీర్థం కైంకర్యాన్ని స్వయంగా చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. వీరినే శ్రీశైలపూర్ణులని కూడా అంటారు. వీరే భగవద్రామాజుల వారికి తిరుపతి అలిపిరిలో శ్రీ మద్రామాయణ రహస్యాలను ఉపదేశించిన గురువులు. అంతేకాదు ఈ తిరుమల నంబి గురువులే కాక స్వయంగా రామానుజుల వారికి మేనమామ కూడా. నేటికీ తిరుమల క్షేత్రంలో జరిగే శ్రీవారి బంగారు పాద, బోగ శ్రీనివాసమూర్తుల నిత్యాభిషేకానికి, మూలవరుల శుక్రవారాభిషేకానికిగాను తిరుమల నంబి వంశీయులే ఆకాశగంగగా తీర్థకైంర్యంలో పాలుపంచుకుంటూ తమ జీవితాల్ని ధన్యం చేసికుంటూ ఉన్నారు. ఏడుకొండల వాడ..గోవిందా..గోవిందా...!