బోలికొండ రంగనాథ స్వామి దేవాలయం -బోలికొండ
అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి గుత్తి పట్టణానికి వెళ్ళే ప్రధాన రహదారి లో గుత్తి పట్టణానికి 9 కి మీ దూరం లో గల తొండపాడు గ్రామం లో వెలసిన రంగనాథ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైంది మరియు మహిమన్మితమైన విష్ణు క్షేత్రం . మహర్షుల కోరిక మేరకు శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రం లో వెలిసాడు అని పురాణాలూ చెబుతున్నాయి .
స్వామివారు కొలువై వున్న కొండకు “శ్వేతగిరి అని పేరు. తెల్లటిరాళ్ళు ఉన్నటువంటి కొండ కనుక దీనికి ‘శ్వేతగిరి’ అనే పేరు ఏర్పడిందని చెప్తారు. ఆ కొండకే ‘బోలికొండ’ అని పేరు. కొండపైన తెల్లటి పొడలు వచ్చినట్లుగా (బొల్లి) ఉండడం మూలంగా ఆ కొండకు “బోలికొండ’’ అనే పేరు ఏర్పడిందని కూడా ప్రచారంలో ఉంది. బోలికొండ మీద కొలువైవున్న రంగనాథస్వామి కనుక “బోలికొండ రంగనాథస్వామి’’ అనే పేరు ఈ స్వామికి వచ్చినట్లు కథనం.
కొండపైన గల ఆలయంలో వెలసిన శ్రీరంగనాథస్వామి వారి రూపం స్పష్టంగా కనిపించదు. శ్రీరంగనాథుడు పుట్టుశిలగా వెలసినట్లు చెప్తారు.
దక్షిణాభిముఖంగా వున్న ఈ ఆలయం ముఖమండపం, గర్భాలయాలను కలిగివుంది. ప్రధాన గర్భాలయంలో శ్రీరంగనాథస్వామి శేషతల్పంపై శయనించి, భక్తులపై తన చల్లని చూపులను ప్రసరింపజేస్తూ దర్శనమిస్తాడు. స్వామివారి చరణముల వద్ద శ్రీదేవి, భూదేవి కూర్చుని వుంటారు. స్వామివారి నాభి నుంచి ఉద్భవించిన బ్రహ్మదేవుడిని, స్వామివారి ముందు వైపునగల ఉత్సవ విగ్రహాలను దర్శించుకొనవచ్చు. ఈ రంగనాథస్వామికి “మాణిక్య రంగనాథస్వామి’’ అని పేరు. పవిత్రమైన హృదయాలతో ఈ స్వామిని సేవిస్తే కోరికలన్నీ తీరుతాయని ఈ ప్రాంత భక్తుల నమ్మకం.
వెళ్ళు మార్గం :-
‘తాడిపత్రి – గుత్తి’ ప్రధాన రహదారిలో వున్న తొండపాడు వద్ద బస్సులు ఆగుతాయి.