info.manatemples@mail.com

+91 9866933582

గుడిపల్లి శ్రీ సజ్జగంటరంగనాథస్వామి దేవాలయం, గుడిపల్లి, పెనుకొండ తాలుకా ,అనంతపూర్ జిల్లా




అనంతపురం జిల్లా పెనుకొండ తాలుకా లోని సోమందేపల్లి కి ఆగ్నేయముగా గుడిపల్లి గ్రామం లో నిర్మించబడిన పురాతన దేవాలయం శ్రీ సజ్జగంటరంగనాథస్వామి దేవాలయం. ఈ దేవాలయం కూడా లేపాక్షి దేవాలయము వలె ప్రత్యేకమగు పునాదులు లేకుండా కొండ పైన నిర్మించబడింది. కొండని మలచి అందలి రాళ్ళతోనే కట్టబడింది. దేవాలయపు దక్షిణ భాగమందలి శాసనాల ద్వారా ఈ దేవాలయం శాలివాహనశకం 1221 ప్రమోదూత నామ సంవత్సరములో ఇది నిర్మితమైనట్టు తెలుస్తోంది. అనగా హోయసల వంశాబ్ధి చంద్రుడు మొదటి విష్ణువర్ధనుని కాలం లో క్రీ.శ 1229 లో నిర్మించబడింది.


స్థల పురాణం :- ఈ గుడిపల్లి గ్రామము యొక్క పాత చెరువుకు తూర్పుమరవ దగ్గర ఒక రైతు తన పొలంలో సజ్జపైరు సాగు చేయుచుండెను. ఆ చేను లో ఒక పుట్ట కలదు.ఆ పుట్ట వద్దకు ప్రతిదినం ఒక ఆవు ఆ పుట్ట దగ్గరికి వెళ్లి ప్రతిరోజు తనంత తానే పాలను పుట్టలోనికి వదులుతుండెను. ఇంట పిండినపుడు పాలు రాకుండుట గమనించిన గోవుల కాపరి ఐన గొల్ల నర్సయ్య ఒకదినం ఆవును వెంబడించి పాలను ఆవు పుట్టలో వదులుట చూసి నర్సయ్య ఆశ్చర్యపోయి అందులో ఏముందో అని చూడగా ఒక విధమైన దివ్యతేజస్సు కన్పించినది.

అదే సమయములో విజయనగర సామ్రాజ్యాదీశులైన శ్రీ కృష్ణదేవరాయల కులగురువగు శ్రీ కోటి కన్యాదానం తాతాచార్యుల వారికి శ్రీరంగనాథుడు కలలో కనిపించి తనను ప్రతిష్టించమని కోరుతూ సజ్జచేనులో తను ఉన్న స్థలాన్ని చూపెను.కలలో కన్పించిన దివ్యతేజస్సు మహదానందాన్ని కలిగించినా ఆ స్థలాన్ని పోల్చుకోలేక మిన్నకుండెను .ఈ విధముగా మూడు రోజుల పాటు వరుసగా కలలో తన దివ్యతేజస్సును చూపెను. గుడిపల్లి గ్రామానికి చెందిన గోకాపరి నర్సయ్య తనకు జరిగిన అనుభవాన్ని కులగురువగు తాతాచార్యుల వారికి విన్నవించెను.వెంటనే వారు ఇరువురు వచ్చి పుట్టను తవ్వించి చూడగా అందు లింగాకారము గల ఒక శిల కానవచ్చెను.

ఆ సమయములో ఆ శిల దివ్య కాంతులీనుతుండెను. దానిని భగవత్స్వరూపముగా భావించి పూజించుచుండగా మూడవ నాటి రాత్రి ఆయనకు స్వప్నములో తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమై భక్తుల రాకపోకలకు తిరుపతి దూరంగా ఉన్నందున భక్తులకు సులభముగా దర్శనమునీయదలచి ఇచ్చటనే అవతరించితినని ఆనతిచ్చి అదృశ్యమయ్యెను. తర్వాత తనకు కలలో జరిగినదర్శనమును తన శిష్యుడు కృష్ణదేవరాయల వారికి తాతాచార్యుల వారు విన్నవించెను.

మహారాజు ఆశ్చర్యపోయి తనకు వచ్చిన స్వప్నములతో పోల్చుకొని గుడిపల్లికి వచ్చి భక్తరక్షణార్ధమై వెలసిన ఈ శిలారూపక స్వామిని దర్శించుకొని ఆనందభరితుడై అంతకుముందే విష్ణువర్ధనునిచే నిర్మించబడిన వెంకటేశ్వరాలయంలో అందు లింగాకార రంగనాథస్వామిని ప్రతిష్ఠ చేయించి, సజ్జగంటలో ఉద్భవించినందున సజ్జగంటరంగనాథస్వామి అని పేరిడి ఆలయములో ఇంతకుముందే దేవేరులతో సహా వేంచేసిన వేంకటనాధుని సేవించి ఆనందించి కోనేరు, రెండు పుష్కరినులను తవ్వించి మహావైభవముగా కైంకర్యములు చేయించుచుండిరి.

గర్భగుడిలో ఉద్భవమూర్తిగా రంగనాథస్వామి వారున్నారు. స్వామివారికి ఇరువైపులా శ్రీ అలివేలుమంగమ్మ శ్రీ మహాలక్ష్మి అమ్మవార్లు ఉన్నారు. వడగలై సాంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ తిరునామధారణజరుగుతోంది. ఆలయానికి ఆగ్నేయములో యజ్ఞశాల కలదు





స్వామి వారికి ప్రతి నిత్యం జరిగే విశేషమైన పూజా కార్యక్రమాలతో పాటు పండుగలప్పుడు,ధనుర్మాసం లో విశేషమైన సేవలు నిర్వహించబడుతాయి .








Route Map:-